దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తాజాగా ఆదివారం రోజు ఓట్లను లెక్కించారు. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. త్రిపురలో అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బర్డోవాలి( పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గాలకు, జార్ఖండ్ లోని మందార్, ఢిల్లీలోని రాజిందర్ నగర్, ఏపీలోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజవర్గాలతో పాటు పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ, ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఇదిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా యూపీలోని రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాల ఫలితాలపై అందరి చూపు నెలకొంది. ఈ రెండు స్థానాలు సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటల్లాంటివి. ఉప ఎన్నికల్లో ఎస్పీ కంచుకోటల్ని బీజేపీ బద్ధలు కొట్టింది. బీజేపీ ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ఈ రెండు స్థానాల నుంచి గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, మరో కీలక నేత ఆజాంఖాన్ లు ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో వీరిద్దరు కూడా అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడంతో పార్లమెంట్ స్థానాలను వదులుకోవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
గతంలో ఆజాంగఢ్ నుంచి అఖిలేష్, రాంపూర్ నుంచి ఆజాం ఖాన్ ఎంపీలుగా ఉన్నారు. ఎస్పీకి పట్టున్న ఈ రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోంది. ఇప్పటికే రాంపూర్ లో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యాం సింగ్ లోధీ విజయం సాధించగా.. ఆజాంగఢ్ లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ లీడింగ్ లో ఉంది. యోగీ 2.0 సర్కార్ కొలువదీరిన తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఎస్పీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది.