రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలో నిలిపిన ద్రౌపది ముర్ము ఈనెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో సడెన్‌గా ద్రౌపది ముర్ము పేరు తెరపైకి వచ్చింది. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే.. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా తన పేరును చరిత్రలో లిఖించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనే ద్రౌపది పేరు ప్రధానంగా వినిపించినా చివరి నిమిషంలో అప్పటి బిహార్ గవర్నర్‌గా ఉన్న దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ ఖరారు చేసింది.
ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే సంప్రదాయ గిరిజన కుటుంబంలో ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్‌గా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితురాలై ఆమె బీజేపీలో చేరారు. కార్యకర్త నుంచి జాతీయ కమిటీలో చోటు పొందే స్థాయికి ఎదిగారు. ఒడిశాలో 2000-2002 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ నుంచి ద్రౌపది ముర్ము మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కొడుకులు గతంలో చనిపోయారు. ప్రస్తుతం ఓ కుమార్తె ఉంది. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 29తో గడువు ముగియనుంది. మరోవైపు ఈనెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలిపారు.