భారత ఉప రాష్ట్ర ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబందించి పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.. ఇక, ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.. అయితే, ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోంది.. దీనికోసం ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Also: England: బ్రిటన్ లో భారీగా ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్, ఎమర్జెన్సీ
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొద్ది రోజులే మిగిలి ఉంది. బీజేపీ కార్యాలయంలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలోనే బీజేపీ నేతలు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల నేతలతో ఫోన్‌లో చర్చించి, ఆ తర్వాత ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి 303 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 91 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఈ 91 మంది సభ్యులతో పాటు, 5 నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయవచ్చు.. దీంతో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.