ఎప్పుడూ కూల్ గా ఉండే యూకే ప్రస్తుతం మండిపోతోంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీగా ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో బ్రిటన్ వాతావరణ శాఖ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే సోమవారం, మంగళవారాల్లో ఇంగ్లండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచానా వేసింది. గతంలో ఉన్న రికార్డులను తిరిగిరాసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతాయని బ్రిటన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Also: Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు
యూకేలోని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో జూలై25, 2019న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెణ్ లో అత్యధికంగా 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.
రాజధాని లండన్ నుంచి మాంచెస్టర్, వేల్ ఆఫ్ యార్క్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండల తీవ్రత వల్ల చాలా ప్రాంతాల్లో అత్యవసర సదుపాయాలకు విఘాతం ఏర్పడుతుందని.. విద్యుత్ సరఫరాకు నష్టం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.