ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయాలు కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా, అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యంలో మునిగిపోయాయి. ఆయన ప్రకటించే ముందువరకు కూడా ఫడ్నవీస్ సీఎం, ఏక్‌నాథ్ డిప్యూటీ సీఎంగా అందరూ భావించారు. కానీ ఆయన ప్రకటనతో సీన్ మారిపోయింది. కానీ ఇలా ఎందుకు ప్రకటించారనే విషయంపై చాలా వరకు ఆలోచనలో పడ్డారు.
శివసేనలో గతంలో చీలికలు ఏర్పడ్డాయి. కానీ ఈ సారి మాత్రం అత్యధికంగా ఎమ్మెల్యే తిరుగుబాటు బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెరవెనుక ఉన్న సూత్రధారి భాజపానే అని కాంగ్రస్ తో పాటు ఎన్సీపీ నేతలు ఆరోపించారు. శివసేనకు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మంచి పట్టుంది. రానున్న ఎన్నికల్లో ఓటర్లు సానుభూతితో శివసేన వైపు మొగ్గు చూపితే మొదటికే మోసం వస్తుంది. ఈ అంశాలను పూర్తిగా విశ్లేషించిన బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ పీఠానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో సర్కారు ఏర్పాటు కానుంది. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ కూడా రెండేళ్లలోనే ముగియనుంది ఈ నేపథ్యంలో పెద్ద కార్యక్రమాలు చేపట్టలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించిన బీజేపీ.. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు సేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అపవాదు వచ్చే ప్రమాదముంది. దీంతో అధికారాన్ని శివసేన తిరుగుబాటు దారులకే అప్పగించింది. ఒక వేళ ప్రభుత్వ వైఫల్యాలుంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుంది తప్ప భాజపాకు కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడంతో పాటు దూకుడు పెంచిన సంగతి తెలిసింది. కానీ మహారాష్ట్రలో మాత్రం శివసేన అంతర్గత విభేధాలతో కూలిపోయేట్లు బీజేపీ వ్యవహరించింది. ప్రభుత్వానికి దూరంగా ఉండటం ద్వారా తాము ఎలాంటి తెరచాటు యత్నాలు చేయలేదని నిరూపించేందుకు యత్నిస్తోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు బలహీనంగా మారుతున్నాయి. మరోవైపు ఇప్పుడు ఏర్పడిన ఏక్‌నాథ్ షిండే సర్కారు బీజేపీపై ఆధారపడాల్సిందే. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించడం కంటే ఓపికగా వ్యవహరించడమే మేలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అమిత్ షా సూచన మేరకు ఫడ్నవీస్ కూడా అందుకు అంగీకరించినట్లు తెలిసింది.