BJP: లోక్‌సభ ఎన్నికల్లో ముగిశాయి. మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ మార్క్ 272 కన్నా కేవలం 20 సీట్లను అధికంగా కూటమి సాధించింది. గతంలో 2014, 2019లో రెండు సార్లు బీజేపీ స్వతహాగానే 272 మార్కును దాటి సీట్లను సాధించింది. అయితే, ఈ సారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడానికి కారణం ఉత్తర్ ప్రదేశ్ అనే సమాధానం వినిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 80 సీట్లు ఉంటే కేవలం 36 సీట్లను మాత్రమే బీజేపీ సాధించింది. ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను దక్కించుకుని అందర్ని ఆశ్చర్యపరిచింది. చివరకు హిందువుల 500 ఏళ్ల కల అయిన రామ మందిరాన్ని నిర్మించిన బీజేపీ, రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఆ పార్టీనే కాకుండా, దేశాన్ని షాక్‌కి గురిచేసింది. జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన నాలుగు నెలల కాలం తిరగకముందే ఆ స్థానంలో బీజేపీకి ఓటమి రుచి చూపించారు.
Read Also: Affiliate Marketing: ‘అఫిలియేట్ మార్కెటింగ్’ అంటే ఏంటి.. దానిని ఎలా మొదలుపెట్టాలంటే..
అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్‌ని ఓడించారు. అయితే, దీనికి 100 కి.మీ దూరంలో ఉన్న శ్రావస్తిలో కూడా రామ మందిరంతో సంబంధం ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. శ్రావస్తీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాకేత్ మిశ్రా బరిలో దిగారు. ఈయన రామమందిరం నిర్మించే ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్న నృపేంద్ర మిశ్రా కుమారుడు. ఇతడిని ఎస్పీకి చెందిన రామ్ శిరోమణి వర్మ ఓడించారు. శ్రావస్తికి బౌద్ధం, హిందూ, జైన చరిత్రలతో సంబంధం ఉంది. మహాభారతం వంటి పురాతన హిందూ గ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. జైనమతంలో కూడా, శ్రావస్తి మూడవ తీర్థంకరుడైన సంభవనాథతో సహా అనేక తీర్థంకరులతో సంబంధం కలిగి ఉంది.