Madhavi Latha: హిందూ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి కర్ణాటకలోని బీదర్ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. బీజేపీకి చెందిన తెలంగాణ నేత మాధవి లతతో పాటు ముగ్గురు వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొనకుండి నిషేధించారు. కలెక్టర్ నిర్ణయాన్ని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలే ఆదేశాల మేరకు మాధవి లత సోమవారం వరకు బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధాన్ని విధించారు.
Read Also: Bangladesh: పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌కి పెరిగిన స్నేహం.. భారత్ ఆందోళనలు ఏమిటి.?
జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆదివారం నిర్వహించాల్సిన హిందూ గ్రూప్ సమావేశానికి కలెక్టర్ అనుమతి నిరాకరించడంతో పాటు, ఈ కార్యక్రమంలో పాల్గొనే కీలక నేతలపై నిషేధం విధించారు. బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధించిన నాయకుల్లో మాధవి లత, శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్, హిందూత్వ కార్యకర్త కాజల్ హిందుస్తానీ ఉన్నారు. మతపరమైన ఉద్రిక్త ప్రసంగాలు చేయడంలో వీరు ‘‘అలవాటు నేరస్తులు’’ అని, ఇది జిల్లాలో శాంతిభద్రతల విఘాతానికి దారి తీసే అవకాశం ఉందని డిసెంబర్ 7 ఉదయం 12 గంటల నుంచి డిసెంబర్ 09 ఉదయం 6 గంటల వరకు నిషేధాన్ని విధించారు.
బీదర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన సాయి స్కూల్ గ్రౌండ్‌లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144 అని పిలుస్తారు) ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కలెక్టర్, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ నేతలు ఖండించారు. ఇది హిందువుల గొంతుకను అణిచివేసే కుట్రగా విమర్శించారు.