Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది.
Read Also: Afghanistan: భారీ కుట్ర భగ్నం..! పాకిస్థాన్ నుంచి భారత్‌కి ఉగ్రవాది.. అరెస్ట్ చేసిన తాలిబన్లు..!
బుధవారం, బీహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ ఆయన మీ ఓట్లను కోరుకుంటున్నారు. మీరు నరేంద్రమోడీని డ్యాన్స్ చేయాలని చెబితే, ఆయన డ్యాన్స్ చేస్తారు. వారు మీ ఓట్లను దొంగలించే పనిలో ఉన్నారు. వారు ఈ ఎన్నికలను అంతం చేయాలని అనుకుంటున్నారు. వారు మహారాష్ట్రలో ఎన్నికల్ని దొంగిలించారు. హర్యానా ఎన్నికల్ని దొంగిలించారు. బీహార్‌లో ఇదే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. ‘‘ ఈ ఎన్నికల్లో నిజమైన వార్తలు నాపై జరిగిన అవమానాలు కాదు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అంతర్గత కలహాలు. వారి సంబంధం నూనె, నీరు లాంటిది. నివేదికల ప్రకారం, ఆర్జేడీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల పోస్టర్లను తొలగిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్జేడీ పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికార దాహం వారిద్దరిని కలిపింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. రాహుల్ గాంధీ ఛత్ పూజపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మాట్లాడుతూ.. వారు దేవతల్ని అవమానిస్తున్నారని, బీహార్ వారిని ఎన్నటికి క్షమించదు అని ప్రధాని అన్నారు.