P Chidambaram: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎల్లప్పుడు శత్రువులను రక్షించడానికి ఉంటుందని విమర్శించింది.
ది క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాజీ హోం మంత్రి మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ‘‘వారు ఉగ్రవాదుల్ని గుర్తించారా..? వారు ఎక్కడ నుంచి వచ్చారు..? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు..? దానికి ఆధారాలు లేదు’’ అని ఆయన అన్నారు.
Read Also: Donald Trump: అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి, పాక్ లోని ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 11 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ‘‘యుపిఎ హయాంలో హోం మంత్రిగా పనిచేసిన పి. చిదంబరం, అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు, మరోసారి తనను తాను కీర్తించుకున్నారు’’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోసారి పాకిస్తాన్‌కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోందని, కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని దుయ్యబట్టారు.