Rajya Sabha Poll: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బీజేపీకి వరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండీ, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జైకొట్టారు. దీంతో రాజ్యసభ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలిచిందని ఆ పార్టీ నేత జైరాం ఠాకూర్ ప్రకటించారు. అయితే, ఎన్నికల సంఘం అధికారికంగా ఫలితాలన్ని ప్రకటించాల్సి ఉంది.
Read Also: Bihar: బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..
మరోవైపు హిమాచల్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సుఖు సంచలన ఆరోపణలు చేశారు. తమ ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్లారని ఆరోపించాడు. బీజేపీ పోలింగ్ అధికారుల్ని బెదిరించిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి సరికాదని అన్నారు. సీఆర్పీఎఫ్, హర్యానా పోలీస్ కాన్వాయ్ సాయంతో 5-6 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని అన్నారు. ఎమ్మెల్యేలను హర్యానాలోని పంచకులలోని గెస్ట్ హౌజులో ఉంచారని, ప్రజలను, మీడియాను అనుమతించడం లేదని చెప్పారు.