Congress: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025లో పాల్గొనేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఇదే అక్కడ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న అధికార కుమ్ములాటలే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం చురుకుగా పోటీ పడుతుండగా, కర్ణాటక మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని బీజేపీ విమర్శించింది.
గతేడాది జరిగిన దావోస్ సమ్మిట్‌లో కర్ణాటక రూ. 22,000 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఎవరూ వెళ్లకపోవడాన్ని బీజేపీ హైలెట్ చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ఆయన మంత్రివర్గం రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టడం కన్నా అంతర్గత అధికార పోరాటాలతో మునిపోయిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయేంద్ర ఆరోపించారు.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ‘‘భారతదేశ స్టార్టప్ క్యాపిటల్’’ అనే బిరుదును మహారాష్ట్రకు కోల్పోయిందని, ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని బీజేపీ ఆరోపించింది. సిద్ధరామయ్య, ఆయన మంత్రులు ఎవరూ ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆసక్తి చూపించడం లేదని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అన్నారు. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు, ఏకపక్ష వైఖరిలో ముగినిపోయిందని విమర్శించారు.