Misa Bharti: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతల్ని జైలులో వస్తామని చెప్పడం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ, బీజేపీ పార్టీల నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మిసా భారతీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. అసలు మీకు ‘మిసా’ అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Read Also: Couple In Flight: పాపం.. వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో.. ఫ్లైట్ లో అందరిముందే ఏకంగా..?
లాలూ కుమార్తె మిసా భారతి మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటేసి గెలిపిస్తే నరేంద్రమోడీ, ఇతర బీజేపీ నేతల్ని జైలులో పెట్టడం ఖాయమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ‘‘మిసా అని మీ నాన్న ఎందుకు పేరు పెట్టారో ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మిసా(అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) కింద లాలూ ప్రసాద్ యాదవ్‌ని జైలులో పెట్టింది. ఈ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించకుండా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. లాలూ యాదవ్‌ని ఆ సమయంలో కాంగ్రెస్‌ని నాశనం చేస్తానని అన్నారు. అందుకే తమ కుమార్తెకు మిసా అనే పేరుపెట్టారు. మిసా భారతి తన తండ్రి ప్రమాణాన్ని ఎగతాళి చేస్తుందా..? ఆమె పేరు మార్చుకోవాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ప్రచారం ఏ స్థాయికి దిగజారిపోయాయనే దానికి మిసా భారతి వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. మోడీని చంపుతాం, జైలులో వేస్తామని మిసా చెబుతున్నారని, అయితే దేశం మాత్రం అవినీతిపరులు జైలులోకి వెళ్తారా..? లేదా.? అని మాట్లాడుకుంటున్నారని అన్నారు. మిసా భారతి ముందు తన కుటుంబం గురించి ఆలోచించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆమె కుటుంబం చాలా రకాల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని, కోర్టు వారిని శిక్షించిందని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లాలూకు జైలు శిక్ష పడలేదని మిసా గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.