Sanjay Raut: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స, ఇతర చికిత్స అనంతరం ఈ రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Read Also: Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే లక్ష్యంగా వరాలు
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా తేలింది. బంగ్లాదేశ్‌ని దేశంలోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కేంద్రాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ‘‘ముంబై ఇప్పటికీ సురక్షిత నగరమే. ముంబైలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే, అది మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే’’ అని అన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రశ్నిస్తూ.. ‘‘ దేశంలో అక్రమ బంగ్లాదేశీయులు ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు..? కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి ఏం చేస్తున్నారు..? ప్రభుత్వం అక్రమ వలసల్ని ఎందుకు సమర్థవంతంగా నిరోధించలేదు..?’’ అని సంజయ్ రౌత్ అడిగారు. ఎన్నికలు జరిగే ప్రతీసారి బీజేపీ అక్రమ బంగ్లాదేశ్ వలసల్ని తెరపైకి తెస్తుందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక కథనాన్ని సృష్టించి, ప్రజల దృష్టి మరల్చేందుకు దీనిని ఒక సాకుగా బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు.