Supreme Court To Hear Plea Against 11 Convicts’ Release in Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దోషులుగా తేలారు.. శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 11 మంది దోషులను రిమిషన్ పాలసీ కింది గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, మరొక వ్యక్తి దాఖలు చేసిన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు విన్న తరువాత ఈ కేసును పరిశీలించేందుకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం అంగీకరించింది. గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది.
Read Also: Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
11 మంది దోషులను విడుదల చేయడంతో పాటు వారిని సన్మానించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు దీన్ని తప్పుపట్టాయి. హత్య, అత్యాచారం కేసుల్లో దోషులుగా ఉన్నవారిని ఇలా విడుదల చేయడాన్ని చూస్తే ప్రధాని మోదీ మహిళలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎర్రకోటపై మహిళ గొప్పతనం గురించి మాట్లాడిన మోదీ.. 24 గంటలక గడవక ముందే మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని విడుదల చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీలో సంబంధం ఉన్న రిమిషన్ కమిటీ సభ్యులు వీరి విడుదలకు సిఫార్సు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
2002లో సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం తరువాత గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ మత ఘర్షణల్లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 2008లో ముంబై ప్రత్యేక కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది.