బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఊహించని రీతిలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఒక పండుగలా ఓటర్లంతా తరలివచ్చి ఓటు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని రికార్డ్‌ను నమోదు చేసింది. తొలి విడతలో అత్యధికంగా 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. అంటే దాదాపు 74 సంవత్సరాల తర్వాత 2025లో అత్యధిక పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు.. భారత్‌లో పర్యటనపై హింట్
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో భాగంగా గురువారం 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతగా మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. అధికార కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండగానే బరిలోకి దిగింది. ఇక ఇంటికో ప్రభుత్వం అంటూ ప్రతిపక్షం హామీ ఇవ్వగా.. అధికార కూటమి మాత్రం కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ మేనిఫెస్టో ప్రకటించింది. ఇలా ఎవరికి వారే ప్రజలపై అనేక హామీలు కుమ్మరించాయి. మేనిఫెస్టో ప్రభావమో.. లేదంటే మార్పు కోసమో తెలియదు గానీ.. ఈసారి పోలింగ్ శాతం మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఆయా పార్టీలు విజయావకాశాలపై రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Vande Mataram: నేడు “వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ
తొలి విడతలో మహిళలు రికార్డ్ స్థాయిలో పాల్గొని ఓట్లు వేశారని ఎన్నికల అధికారి వినోద్ గుంజ్వాల్ తెలిపారు. ఓటింగ్ సమయంలో వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. 1951-52లో జరిగిన మొదటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టింది. తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది.
అయితే భారీగా పోలింగ్ నమోదు కావడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మార్పు కోసమే మహిళలు తరలివచ్చారని చెబుతున్నారు. జీవికా దీదీల ఉద్యోగాలు పర్మినెంట్ చేసి రూ.30,000 జీతం ఇస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించారు. అలాగే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న హామీ కూడా ప్రజల్లోకి వెళ్లిందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి కలిసొస్తుందో నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.
#WATCH | Patna: Bihar Chief Electoral Officer Vinod Gunjyal says, "The first phase of voting for the Bihar Assembly elections has been successfully completed. Voting is still ongoing in some places, and we're updating data. The current voter turnout is 64.46%. We will release the… pic.twitter.com/dTWDNTbqwO
— ANI (@ANI) November 6, 2025