Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే తాజాగా సోమవారం టెస్టుల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కేవలం ఒకే రోజులో స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బీహార్ లో ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఆర్జేడీతో అధికారం చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్ కు షాకిచ్చేందుకు సిద్ధం అయింది బీజేపీ. ప్రస్తుతం స్పీకర్ బీజేపీ వ్యక్తే కావడంతో గతంలో అనర్హత ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించాడు. సోమవారం బీజేపీ నేత రామ్ నాయాయన్ మండల్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యులతో స్పీకర్ సమావేశమై నివేదిక సమర్పించారు. మొత్తం 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు 2021 మార్చిలో బీహార్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ‘పోలీస్ బిల్లు’పై జరిగిన చర్చ సమయంలో అసెంబ్లీ విధులకు ఆటంకం కలిగించారు. వీరందరిపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మొత్తం 243 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. అయితే బీజేపీకి జేడీయూకు కలిపి ప్రస్తుతం 127 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయిన జేడీయూ.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఒక వేళ స్పీకర్ ఆర్జేడీ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.