బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో సంక్రాంతి పండగ సందర్భంగా కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. శనివారం ఆరుగురు మరణించగా… ఆదివారం మరో ఐదుగురు మరణించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం గమనార్హం. 2016 నుంచి బీహార్‌లో మద్యపాన నిషేధం ఉండగా.. గత రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యానికి అలవాటు పడి 40 మంది మరణించారని అధికారులు చెప్తున్నారు.
Read Also: 3 వేల నిరుద్యోగభృతి ప్రకటించిన కేజ్రీవాల్
తాజాగా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో శుక్రవారం రాత్రి నలంద సమీపంలోని చోటిపహరి, పహరితల్లి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవించారు. వీరిలో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. శనివారం ఆరుగురు మరణించారు. ఈరోజు మరో ఐదుగురు మరణించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. కల్తీ మద్యం ప్రజలను కాటేస్తున్న నేపథ్యంలో నితీష్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ జేడీయూ నేతలపై విమర్శలు గుప్పించారు.