Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 23న నితీష్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ వంటి పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 20న నితీష్ కుమార్ తమిళనాడు పర్యటకు వెళ్లనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ని కలిసేందుకు ఆయన వెళ్లనున్నారు. విపక్షాల ఐక్యత లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది.
స్టాలిన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు నితీష్ కుమార్ తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 20న భేటీ తర్వాత, 21న ఆయన పాట్నాకు వెళ్లనున్నారు. జూన్ నెలలో విపక్షాల సమావేశం దేశంలో రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు రాజకీయ పార్టీలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీని సమావేశానికి వచ్చేలా ఒప్పించడంతో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకుల మధ్య సయోధ్యను కుదురుస్తున్నారు.
Read Also: Konda Murali : టెక్స్‌టైల్స్ పార్క్ భూసేకరణలో రైతులకు న్యాయం జరగలేదు
గతేడాది బీజేపీని కాదని సీఎం నితీష్ కుమార్ తన పార్టీ జేడీయూని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నాయి. అయితే బలమైన బీజేపీని, మోడీ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత, విపక్షాల కూటమితోనే సాధ్యమని నితీష్ కుమార్ తో పాటు పలు విపక్ష పార్టీలు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని క్యాబినెట్ మినిస్టర్ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్, డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. అతని అరెస్ట్ నేపథ్యంలో తమిళనాడులో పెద్ద హైడ్రామా నడిచింది. ఇదిలా ఉంటే కేంద్ర సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలతో బీజేపీ ప్రభుత్వం విపక్షాలను భయపెట్టాలని చూస్తోందని స్టాలిన్ ఆరోపించారు.