ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఆమె సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు నకిలీ అని వార్తలు వినిపిస్తుండగా.. కొత్తగా మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పూజా ఖేద్కర్.. దివ్యాంగురాలిగా సర్టిఫికెట్ పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఒక ఆస్పత్రి తిరస్కరించగా.. మరొక ఆస్పత్రి జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పత్రం తాజాగా వైరల్ అవుతోంది. యూపీఎస్సీలో వికలాంగ కోటాలో ఉద్యోగం సంపాదించేందుకు ఆమె పూణెలోని ఔంధ్ ఆస్పత్రి నుంచి నకిలీ మెడికల్ పత్రాన్ని పొందేందుకు ప్రయత్నించింది. కానీ ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. అనంతరం కంటి, మానసిక అనారోగ్యానికి సంబంధించిన పత్రాలను అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ ఆస్పత్రి నుంచి సంపాదించింది. మెడికల్ పత్రం కోసం 2022లో ఔంధ్ ఆస్పత్రి తిరస్కరించింది. అనంతరం 2018, 2021లో అహ్మద్‌నగర్ నుంచి వేర్వేరు సమయంలో రెండు మెడికల్ సర్టిఫికెట్లు పొందగలిగింది. వాటినే అధికారులకు అందించింది. అంతేకాకుండా ఓబీసీ సర్టిఫికెట్ కూడా నకిలీదిగా అధికారులు గుర్తించారు.
ఇవ్వే కాకుండా ఆమె చదువుకు సంబంధించిన పత్రాలు కూడా నకిలీవిగా అధికారులు తాజాగా గుర్తించారు. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూణెలోని శ్రీమతి కాశీబాయి నవలె మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్‌లో 2007లో ఎన్‌టీ-3 కేటగిరీ కింద నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో సీట్ పొందారు. ఈ విషయాన్ని ఓ మీడియాకు సోమవారం మెడికల్ కాలేజీ డైరెక్టర్ అరవింద్ బొహ్రె ధృవీకరించారు.
2007లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజస్ ఆఫ్ మహారాష్ట్ర ప్రవేశపరీక్ష రాసి పూజా మెడికల్ సీట్ తెచ్చుకొన్నారు. ఆమె ఈ పరీక్షల్లో 200కు 146 మార్కులు సాధించారు. ఆమె మహారాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకున్నా.. అప్పటికే రాసిన పరీక్షలో సరిపడా మార్కులు రావడంతో.. నాన్ క్రిమీలేయర్ ధృవీకరణపత్రం సమర్పించి వైద్య కళాశాలలో చేరారు. ఈ కాలేజీ తొలి బ్యాచ్ విద్యార్థుల్లో ఆమె కూడా ఒకరు. అప్పట్లో ఆమె పత్రాలు మొత్తం తాము పరిశీలించగా.. సదరు వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో కూడా సరిపోలినట్లు అరవింద్ వెల్లడించారు. ఈ నాన్ క్రిమీలేయర్ ధ్రువీకరణను అహ్మద్‌నగర్‌లోని పథార్డి సబ్‌డివిజన్‌లో జారీ చేసినట్లు వెల్లడించారు. ఖేద్కర్‌కు 10వ తరగతిలో 83 శాతం, 12వ తరగతిలో 74శాతం మార్కులు వచ్చాయి. ఆమె 2011-12లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇంటర్న్‌షిప్ కూడా నవలే కాలేజీలోనే చేశారు. అప్పట్లో ఆమె కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు.
ప్రస్తుతం పూజా ఖేద్కర్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దొంగ రవాణా కేసులో బంధువును విడిపించడానికి అప్పట్లో అధికారుల్ని బెదిరించినట్లు ప్రభుత్వానికి రిపోర్టు అందింది. అంతేకాకుండా పలుమార్లు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆమె కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను వాడడం.. ఇలా ఒక్కొక్కటి బయటకు రావడంతో ఇప్పటికే వేటు పడింది. ఇక ఆమె తల్లి మనోరమా గ్రామస్థులను బెదిరించడంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. వారి కోసం మూడు బృందాలు వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే పూజా ఖేద్కర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసింది. రెండు వారాల్లో కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.