Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది. గాంధీ, జవహర్ బాల్ మంచ్లు రాజకీయ ఉద్దేశాలతోనే పిల్లలను వాడుకుంటున్నాయని.. పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారని.. దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయని.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది.
బాలలకు సంబంధించి అనేక అవాంతర చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని.. ఇందులో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని.. బాలల హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. రాజకీయ అజెండాలో భాగంగానే భారత్ జోడో యాత్రను ‘బచ్చే జోడో’ యాత్రగా మారుస్తున్నారని ఎన్సీపీసీఆర్ విమర్శించింది. పెద్దలు మాత్రమే రాజకీయ కార్యక్రమాల్లో భాగం కావాలనే ఎన్నికల కమిషన్ నిబంధలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
Read Also: Errabelli Dayakar Rao: బీజేపీ వల్లే దేశం నాశనమవుతోంది
ప్రాథమికంగా బాలల హక్కుల ఉల్లంఘన జరిగినందున.. రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి పిల్లలను ఆసరాగా ఉపయోగించడం వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఇది వ్యతిరేకం అని.. సంఘటనపై సమగ్ర విచారణ జరిగి.. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ముగుస్తుంది. 3570 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది.