Bengaluru: దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. ‘‘తన భర్త తన కన్న పెంపుడు పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు’’ అంటూ భార్య కేసు పెట్టింది. సాధారణ వైవాహిక సమస్యగా ప్రారంభమైన ఈ వివాదం కోర్టుకు చేరింది. తన భర్త పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, పిల్లి తనను రక్కిందని భార్య తన కేసులో పేర్కొంది.
Read Also: Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్.. రోప్ పార్టీని సిద్ధం చేసుకున్న పోలీసులు?
క్రూరత్వం, వరకట్న డిమాండ్లకు సంబంధించిన సెక్షన్ 498 ఏ కింద చట్టపరమైన కేసు నమోదైంది. అయితే, ఇక్కడ సమస్య వరకట్న డిమాండ్, గృహహింస కాదని సాధారణ గృహ వివాదంగా కోర్టు పేర్కొంది. జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ కేసుని విచారించారు. పిల్లి చాలా సార్లు భార్యపై దాడి చేయడం, గాయపరచడం గొడవలకు కారణమైంది. అయితే, IPC 498A కింద అభియోగం మోపడానికి అవసరమైన చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా భార్య ఆరోపణలు లేవని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు.
ఇలాంటి కేసులు తరుచుగా చిన్నపాటి కుటుంబ వివాదాల నుంచి ఉత్పన్నమవుతున్నాయని, వనరులు తప్పుడు కేసులకు ఉపయోగించడం ద్వారా నేర న్యాయ వ్యవస్థను ఇబ్బంది పెట్టడమే అని న్యాయమూర్తి చెప్పారు. ఇటీవల బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం కూడా ఐపీసీ సెక్షన్ 498 ఏతో ముడిపడి ఉంది. తప్పుడు కేసు పెట్టడంతో, ఆవేదనతో అతను ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.