Bengaluru water crisis: బెంగళూర్ నగరంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి ట్యాంకర్ల పేరుతో దోపిడి చేసేవారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు జరిమానాలను విధిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే నివాసితులు మాత్రం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
కనకపురలోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ నీటిని పొదుపుగా వాడుకోవాలని, డిస్పోజబుల్ ప్లేట్స్, వెట్ వైప్స్ వాడాలని సలహాలు ఇచ్చారు. మరోవైపు ఈ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రజలు వాష్‌రూమ్స్‌ని ఉపయోగించుకునేందుక సమీపంలోని మాల్స్‌కి వెళ్లుతున్నారు. కొందరు వ్యక్తులు తమ జిమ్‌లకు టవర్స్, బట్టలు తీసుకెల్లి అక్కడే స్నానాలు చేస్తున్నారు.
Read Also: Upasana Konidela: 60 ఏళ్ళ వయస్సులో అత్తమ్మ బిజినెస్.. కోడలు ఎంకరేజ్ మెంట్ మాములుగా లేదే
ఈ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ఒక నివాసి తన బాధను సోషల్ మీడియాలో వెల్లడించారు. తమకు రౌండ్ ది క్లాక్ నీరు అంది ఒక నెల గడిచిందని చెప్పారు. చాలా మంది అద్దెకు ఉండే వారు తమ నివాసాలను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు మారారని, ఎలాంటి ఆశ్రయం లేని వారు తినడానికి డిస్పోజబుల్ ప్లేట్స్ వాడుతున్నారని చెప్పాడు. టాయిలెట్స్ నుంచి మానవ వ్యర్థాల కంపు వస్తోందని పేర్కొన్నాడు. చాలా మంది సమీపంలోని ఫోరమ్ మాల్స్‌కి వినియోగదారుడిగా వెళ్లి తమ అసవరాలను కానిస్తున్నారని తెలిపాడు.
ఖరీదైన ఈ కమ్యూనిటీలో కోటి రూపాయల కన్నా ఎక్కువ విలువైన ఇళ్లకు రుణాలపై ఈఎంఐలు చెల్లిస్తున్నారు, అయితే కనీస సౌకర్యాలు లేవు, ప్రస్తుతం పరిస్థితి భయంకరంగా ఉంది. రుతుపవనాలు వచ్చే వరకు ఈ సమస్యల తప్పదని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ నివాసితుల సంఘం అధ్యక్షుడు వసంత్ కుమార్ చెప్పారు. వర్షాలు రావాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.