West Bengal: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్‌లో రాజకీయ రచ్చకు దారి తీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ ఆరోపణలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రానికి చెందిన వారు కాదని, వారు ఇక్కడ దాక్కున్నారని, రెండు గంటల్లో వారిని అరెస్ట్ చేశామని ఆమె అన్నారు. బెంగాల్‌లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు సూర్తిగా సురక్షితంగా ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
Read Also: PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
సీనియర్ టీఎంసీ లీడర్ కునాల్ ఘోష్ కూడా బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఎన్ఐఏకి రాష్ట్ర పోలీసులు సహకారాన్ని అంగీకరించాలని అన్నారు. బెంగళూర్ బ్లాస్ట్ కేసులో ఈ రోజు ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహా అరెస్టయ్యారు. వీరిద్దరు కీలకమైన కుట్రదారులుగా ఉన్నారు. షాజెబ్ బాంబును అమర్చగా.. తాహా లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. వీరిద్దరిని పూర్బా మేదినిపూర్ జిల్లాలో కంఠి లేదా కోటాయ్ అనే చిన్న పట్టణంలో ట్రేస్ చేశారు.
కంఠి ప్రాంతం బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చెందిన కంచుకోటగా ఉంది. దీంతో కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. రామేశ్వరం కేఫ్ బాంబర్లకు సువేందు అధికారికి మధ్య ఉన్న సంబంధాలను పరిశోధించాలని రాష్ట్ర అధికారులను కోరారు. బెంగాల్ పోలీసులు దేశవ్యతిరేక శక్తుల్ని అణిచివేయడంలో దృఢంగా ఉన్నారని, ఇతర ఏజెన్సీలకు సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బెంగళూర్ కేఫ్ బ్లాస్ట్ కేసులో ఒక బీజేపీ కార్యకర్తను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించడాన్ని కునాల్ ఘోష్ ఎత్తి చూపారు.