Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు. నీటి సంక్షోభం ఉన్న సమయంలో కార్లను కడిగేందుకు నీటిని వృథా చేశారని చెబుతూ.. నగర అధికారులు 22 కుటుంబాలకు జరిమానా విధించారు. 22 కుటుంబాలకు 3 రోజుల్లో రూ. 1.10 లక్షల జరిమానా వసూలు చేశారు.
Read Also: Arvind Kejriwal Arrest: జర్మనీ దారిలోనే అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు..
బెంగళూర్ వాసులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ నగరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదవుతున్నాయని, ప్రజలు నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చైర్‌పర్సన్ రామ్ ప్రశాంత్ మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు విధించిన జరిమానా మొత్తం రూ. 1.10 లక్షల్లో, నైరుతి ప్రాంతం నుంచే రూ. 65,000 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూర్ అధికారులు వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాల నిర్మానం, రన్నింగ్ ఫౌంటైన్లు మొదలైన వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధించారు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కొద్ధి రోజుల్లో భూగర్భ జలాలు అడగంటుకు పోతాయనే వార్తల నేపథ్యంలో నీటి వృథాను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నగరానికి రోజుకు 500 మిలియన్ లీటర్ల నీరు(ఎంఎల్‌డీ) కొరత ఉందని, వాస్తవానికి రోజుకు 2600 మిలియన్ లీటర్లు అవసముందని ఆయన చెప్పారు. బెంగళూర్ నగరంలో 14,000 బోర్ వెల్స్‌లో 6900 ఎండిపోయాయని చెప్పారు.