Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే పరిమితమైంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళను కుటుంబసభ్యులే చితకబాదారు. బాధిత మహిళను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో కలిశారు. సమీనా బీ, ఆమె ఇద్దరు పిల్లల్ని, సీఎం చౌహాన్ పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆమె కుటుంబం ఆమెను కొట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీఎం ఆమెను కలవాలని నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Read Also: Indian Workers : ఏయే దేశాలలో భారతీయులు ఎక్కువగా పని చేస్తున్నారో తెలుసా?
ఆమె భద్రతపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. నా పిల్లలపై శ్రద్ధ చూపినందుకు మరోసారి కూడా బీజేపీకే తాను ఓటేస్తానని సీఎం చౌహాన్‌తో చెప్పినట్లు సమీనా బీ వెల్లడించారు. ‘‘నేను బీజేపీకి ఓటేశానని తెలుసుకున్న నా బావ జావేద్ నాపై దాడి చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీకి ఓటు ఎందుకు వేశావని అతను ప్రశ్నించాడు’’ అని మహిళ చెప్పింది. చౌహాన్ భయ్యా ఎప్పుడూ తప్పు చేయలేదని అందుకే తాను బీజేపీకి ఓటేసినని చెప్పారు. నాలుగు సార్లు ఎంపీ సీఎంగా పనిచేసిన చౌహాన్ తాను ప్రస్తుతం సీఎం రేసులో లేనని, తాను పార్టీ సేవకుడినని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 29 లోక్‌సభ స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యమని, అందుకోసం పనిచేస్తానని చెప్పారు.