Uddhav Thackeray: మహారాష్ట్రలో సరికొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే టార్గెట్ గా ముంబైలో పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి. బ్యానర్లలో ఔరంగజేబు చిత్రం ఉండటం వివాదానికి కారణమైంది. ఉద్ధవ్ ఠాక్రే, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్ కలిసి ఉండటం, అదే బ్యానర్ పై ఔరంగజేబు చిత్రం ఉండటం వివాదానికి కారణమైంది. బుధవారం రాత్రి బ్యానర్లు వెలిశాయి. అయితే ఈ బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే విషయం ఇప్పటికీ తెలియదు. వీటిని రాత్రి పోలీసులు తొలగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కేసులు పెడతామని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల ఔరంగజేబు పైనే మహారాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నెలలో ఔరంగజేబుపై కొంతమంది ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హిందూ సంఘాలు కొల్హాపూర్ లో ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రకాష్ అంబేద్కర్ ఔరంగాబాద్ వెళ్లి, ఔరంగజేబు సమాధిని సందర్శించారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ప్రకాష్ అంబేద్కర్ తో పొత్తు పెట్టుకుంది. ఇటీవల అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించుకున్న సమయంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే టార్గెట్ గా ప్రశ్నలు గుప్పించారు. మీ సిద్ధాంతం ఔరంగజేబుకు మద్దతు ఇవ్వడమేనా..? అని అడిగారు.