Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ నుంచి రూ.95 కోట్ల రుణం పొందాడు. ఇందుకు గానూ నకిలీ పత్రాలను సమర్పించాడు.
Read Also: Srinivas Goud: హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్ జరీన్.. స్వాగతం పలికిన శ్రీనివాస్‌గౌడ్
ఇదిలా ఉంటే తాను అప్పుగా తీసుకున్న పనికోసం కాకుండా ఇతర పనులకు ఈ లోన్ మొత్తాన్ని మళ్లించినట్లు విచారణలో తేలింది. దీంతో బ్యాంకును మోసం చేసిన వ్యక్తిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. నిందితుడైన వ్యాపారవేత్త కౌషిక్ కుమార్ నాథ్ ను మార్చి 30న అరెస్ట్ చేశామని, కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు అతన్ని ఏప్రిల్ 10 వరకు ఈడీ కస్టడీకి పంపిందని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోనే అతిపెద్ద రుణదాగా ఉన్న ఎస్‌బీఐని రూ.95 కోట్ల మేర మోసం చేసినట్లు ఈడీ తెలిపింది.
కౌషిక్ కుమార్ నాథ్ పై మనీలాండరింగ్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ అతడిపై దాఖలు చేసిన కేసులతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నాలుగు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో మనీలాండరింగ్ జరగడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కౌషిక్ కుమార్ నాథ్ తరచూ తన గుర్తింపును మార్చుకుంటూ బ్యాంకులను మోసం చేసేవాడని, ఇటీవల తన మాకాంను ముంబైకి మార్చినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 3.68 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.