Padma hilsa: షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి, కొత్తగా మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ పలువురు ఉగ్రవాద నేతల్ని విడుదల చేయడంతో పాటు, ఉగ్రవాద భావజాలం ఉన్న జమాతే ఇస్లామీ అనే పార్టీపై నిషేధాన్ని కూడా ఎత్తేసింది. దీంతో అక్కడ రాడికల్ ఇస్లామిస్ట్‌లు జమ్మూ కాశ్మీర్‌ని విముక్తి చేస్తామని, ఈశాన్య భారతాన్ని మిగతా దేశం నుంచి కట్ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఇదిలా ఉంటే, బెంగాలీలు అత్యంత పవిత్రంగా భావించే దుర్గాపూజ సమయంలోనే భారత్‌కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఎగుమతి అయ్యే ‘‘పద్మ హిల్సా’’ చేపలపై నిషేధం విధించింది. ప్రతీ ఏడాది దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయంగా భావిస్తుంటారు. బంగ్లాదేశీ ఇలిష్ (బెంగాలీలో ఈ చేపను పిలుస్తారు)పై బ్యాన్ విధించడం ద్వారా బెంగాల్ వ్యాప్తంగా ఈ చేపల డిమాండ్ పెరిగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
గతంలో 2012 నుంచి 2020 వరకు హిల్సా చేపల ఎగుమతిపై సాధారణ నిషేధాన్ని కలిగి ఉన్నప్పటికీ, షేక్ హసీనా ప్రభుత్వం మాత్రం భారతదేశానికి మినహాయింపుని ఇచ్చింది. బంగ్లాదేశ్ ఫిషరీస్ మరియు పశుసంపద మంత్రిత్వ శాఖ సలహాదారు ఫరీదా అఖ్తర్ మాట్లాడుతూ.. స్థానిక వినియోగదారులకు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు. ‘‘ మా ప్రజలు వాటిని కొనలేనప్పుడు, మేము ఇలిష్‌ని ఎగుమతి చేయడానికి అనుమతించము. దుర్గాపూజ సమయంలో భారతదేశానికి ఎలాంటి ఇలీష్ ఎగుమతులు జరగకుండా చూడాలని నేను వాణిజ్య మంత్రిత్వ శాఖకి సూచించాను’’ అని చెప్పారు.
Read Also: Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు..
బెంగాలీలకు ఎంతో ఇష్టం..రుచి అమోఘం:
బంగ్లాదేశ్‌లో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం పద్మా హిల్సాని ఉత్పత్తి చేస్తుంది. ఇది బంగ్లాదేశ్ జాతీయ చేప. 2012 నుండి, తీస్తా నది నీటి-భాగస్వామ్య ఒప్పందంపై వివాదాల కారణంగా బంగ్లాదేశ్ ఐలీష్ ఎగుమతులపై నిషేధం విధించింది, అయితే షేక్ హసీనా ఎగుమతిని సులభతరం చేసింది. దుర్గాపూజ, పొయిలా బోయిసాఖ్ (బెంగాలీ నూతన సంవత్సరం) మరియు జమై సోష్టికి ముందు పద్మ హిల్సా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి సరఫరా అయ్యేది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి చేపల ఎగుమతి నిలిచిపోవడంతో ఒడిశా, గుజరాత్, మయన్మార్ నుంచి వచ్చే చేపల దిగుమతులపై ఆధారాపడాల్సి వస్తుంది.
బంగ్లాదేశ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో గతంలో 1-1.3 కిలోల పరిమాణం ఉన్న చేపల ధర రూ. 1800-2000 నుంచి ఇప్పుడు రూ. 2,200-2400కి పెరిగింది. బెంగాలీ వంటకాల్లో హిల్సాకు ప్రముఖ స్థానం ఉంది. బంగ్లాదేశ్ నుంచి ప్రవహించే పద్మ, గంగా నదుల్లో దొరికే ఈ చేపలకు మంచి రుచి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా పలు సందర్భాల్లో ఆమె భారతీయ నాయకులకు హిల్సాను బహుమతిగా ఇచ్చారు. 1996లో గంగా జలాల భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు హసీనా హిల్సాను బహుమతిగా ఇవ్వడంతో ఈ పద్ధతి ప్రారంభమైంది.