Bangladesh crisis: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగి అల్లర్లు, హింస గురించి అందరికి తెలిసిందే. చివరకు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోవాల్సి వచ్చింది. అల్లర్ల సమయంలో పలు జైళ్లపై దాడులు చేసిన నిరసనకారులు, అందులో ఉన్న ఖైదీలు తప్పించుకునేందుకు కారణమయ్యారు. షేక్ హసీనా రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే ఉగ్రవాదులతో సహా 1200 మంది ఖైదీలు పలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు. అయితే, వీరితో భారత భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తెలిపింది.
తప్పించుకున్న ఖైదీలు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భద్రతా సంస్థలు బీఎస్ఎఫ్‌కి సమాచారం అందించాయి. బంగ్లా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే బంగ్లా-భారత్ సరిహద్దు వద్ద ఆర్మీ, బీఎస్ఎఫ్ గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. బంగ్లా అల్లర్ నేపథ్యంలో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)కి చెందిన అధికారులు దేశంలోని శాంతిభద్రతలను చక్కబెట్టేందుకు వెళ్లారు. బంగ్లా వైపు సరిహద్దుల వద్ద భద్రత బలహీనంగా ఉంది.
Read Also: Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్స్!
సరిహద్దుల్లో భద్రత కోసం ఇరు దేశాల బలగాలు వేర్వేరు స్థాయిల్లో కమ్యూనికేషన్ ఛానెళ్లను తెరిచి, రోజూ చర్చలు జరుపుతున్నారు. చొరబాటుదారులు భారత్‌లోకి రాకుండా రియల్ టైమ్‌లో సమాచారాన్ని పంచుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల బలగాలకు చెందిన కమాండెంట్లు, నోడల్ అధికారులు, సరిహద్దు ఐజీలు ఇతర ర్యాంకుల అధికారులు అన్ని స్థాయిలో సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది.
నార్సింగి, షేర్పూర్, సత్ఖిరా, కుస్తియా మరియు కాశీంపూర్ అనే ఐదు జైళ్ల నుండి ఖైదీలు తప్పించుకుంటున్నారని బంగ్లా అధికారులు మన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, చొరబాటుదారులు ఏం చెప్పినా దేశంలోకి అనుమతించేది లేదని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. నార్సింగి జైలు నుంచి తప్పించుకున్న 400 మంది ఖైదీలు లొంగిపోయారని బీజీబీ అధికారులకు బీఎస్ఎఫ్‌కి సమాచారం అందించారు. అయితే, హెఫాజాత్-ఇ-ఇస్లామ్ కి చెందిన వారు ఇంకా మిస్సింగ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు, ముఖ్యంగా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.