Ballistic missile fired from nuclear submarine INS Arihant:భారత సైనిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్(ఎస్ఎల్బీఎం)ను అరిహంత్ నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. క్షిపణి నిర్ణయించిన విధంగా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారలు వెల్లడించారు.
భారతదేశ అణు సామర్థ్యంలో ఎస్ఎస్బీఎన్ ప్రోగ్రామ్ కీలకమైందిగా రక్షణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఈ పరీక్షను నిర్వహించింది భారత రక్షణ శాఖ. ఈ ప్రయోగం ద్వారా భారత సామర్థ్యం నిరూపితమైందని..అణు నిరోధక సామర్థ్యంలో ఎస్ఎస్బీఎన్ ముఖ్యమైందని రక్షణ శాఖ వెల్లడించింది. భారతదేశ ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానానికి అనుగుణంగా ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Karnataka: నలుగురు మైనర్లపై లైంగిక వేధింపులు..లింగాయత్ పీఠాధిపతిపై మరో కేసు
ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణు జలాంతర్గామి. అణుశక్తితో జలాంతర్గాములు కలిగిన అతికొన్ని దేశాల సరసన భారత్ ను నిలబెట్టింది అరిహంత్. దీన్ని 2009లో ప్రారంభించారు. 2016లో నుంచి సైన్యంలో చేరింది. విశాఖపట్నం పోర్టు సిటీలోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో దీన్ని నిర్మించారు. అడ్వాన్సుడ్ టెక్నాలజీ వెసెల్(ఏటీవీ)ప్రాజెక్టు కింద 6000 టన్నుల బరువున్న ఈ జలాంతర్గామిని నిర్మించారు. 2009 జూలై 26న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అరిహంత్ ప్రారంభం అయింది. ఐక్యరాజ్య సమితిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, రష్యాల తర్వాత ఓ అణు జలాంతర్గామిని నిర్మించిన దేశంగా భారత్ రికార్డుల్లో నిలిచింది.