వృత్తి రీత్యా తాము బిజీ అయిపోవడంతో.. తమ బాబును రోజు మొత్తం చూసుకోవడం కోసం ఒక మహిళను నియమించింది ఓ జంట. ఆమె ప్రవర్తన, మాట తీరు చూసి.. తమ బాబుని ఎలాంటి లోటు లేకుండా, ప్రేమానురాగాలతో తల్లిలాగే చూసుకుంటుందని ఆ దంపతులు అనుకున్నారు. కానీ, ఆమెలో ఉన్న రాక్షసిని మొదట్లో గుర్తించలేకపోయారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత ఆమె అసలు బండారం తెలుసుకొని ఖంగుతిన్న ఆ జంట, సాక్ష్యాధారాలతో సహా ఆ మహిళను పోలీసులకు అప్పగించి తమ బిడ్డను రక్షించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వీళ్లు వృత్తి రీత్యా ఫుల్ బిజీ అయిపోయారు. బాబుని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో, బాబుని చూసుకోవడం కోసం రూ. 5 వేల జీతానికి ఓ మహిళని నియమించారు. ఇతర సదుపాయాలు కూడా కల్పించారు. ఆమె అమాయకంగా వ్యవహరించడం, వారి ముందు బాబుని లాలించడం చూసి.. బాధ్యతగా చూసుకుంటుందిలే అని నమ్మకంగా పిల్లాడ్ని ఆమెకు అప్పగించారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడిలో మార్పు వచ్చింది. ముద్దు ముద్దు మాటలు చెప్తూ చలాకీగా ఉండాల్సిన ఆ బాబు, పూర్తిగా సైలైంట్ అయిపోయాడు. తిండి కూడా సరిగ్గా తినడం మానేశాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? తమ బాబుకి ఏమైందని ఆ దంపతులు ఆందోళన చెందారు.
లాభం లేదనుకొని ఒక రోజు ఆ దంపతులు డాక్టర్ వద్దకు తమ బాబుని తీసుకెళ్లారు. ఆ డాక్టర్ చెప్పిన విషయాలు విని వాళ్లు ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ రెండేళ్ల బాబు తీవ్ర చిత్రహింసలకు గురయ్యాడని, శరీరంలోని అంతర్గత అవయవాలకు వాపు వచ్చిందని చెప్పాడు. ఆయన మాటలు విని షాక్ తిన్న దంపతులు.. ఇది పిల్లాడి బాధ్యతల్ని అప్పగించిన మహిళ పనే అయ్యుంటుందని ఆ జంట అనుమానించింది. ఆ అనుమానంతో ఇంట్లో కెమెరాలు బంధించి, ఎప్పట్లాగే వాళ్లు ఉద్యోగాలకు వెళ్లారు. అందులో రికార్డైన దృశ్యాలు చూసి ఉలిక్కిపడ్డారు. పసి పిల్లాడన్న ఇంగితం కూడా లేకుండా, ఆ బాబుని ఇష్టానుసారంగా కొట్టింది. ఎక్కడికెళ్లినా, జుట్టు పట్టి లాక్కెళ్లడం ఆ దృశ్యాల్లో కనిపించింది. కాస్త ఏడిస్తే చాలు, చెంపలు వాయించేసింది.
ఎంతో గారాభంగా చూసుకుంటోన్న తమ బాబుని ఆ మహిళ కొట్టిన విధానం చూసి ఆ దంపతులు తీవ్రంగా కృంగిపోయారు. ఆమెకు తమదైన శైలిలో తగిన బుద్ధి చెప్పి, ఆ తర్వాత సాక్ష్యాధారాలతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు సైతం ఆ వీడియోలు చూసి ఖంగుతిన్నారు. పలు సెక్షన్ల కింద కేసు పెట్టి, ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ మహిళ ఎంత పని చేశాన్రా దేవుడా అంటూ పశ్చాత్తాపడుతూ.. జైలులో ఊచలు లెక్కపెడుతోంది.