Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారుల, ఒక డీఎస్పీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్‌లు వీర మరణం పొందారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సింగ్ అక్కడికక్కడే మరణించగా, మేజర్ ధోనాక్, డీఎస్పీ భట్ గాయపడి మరణించారు.
Read Also: Nagpur: రేప్ కేసు పెడతానని యువతి బెదిరింపు.. ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడి ఆత్మహత్య
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఇటీవల పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే)లోని రావల్ కోట్ ప్రాంతంలో లష్కరేతోయిబా కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసింను ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. దీంతో లష్కరేతోయిబాకు ఎదురుదెబ్బ తగిలింది. రియాజ్ అహ్మద్ తండ్రి కూడా ఉగ్రవాదే. అతడిని భద్రతాబలగాలు 2005లో మట్టుపెట్టాయి. రియాజ్ అహ్మద్ మరణానికి ప్రతీకారంగానే తాజా దాడి జరిపినట్లు లష్కరోతోయిబా పేర్కొంది.
ఇదిలా ఉంటే నిన్నటి దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అనంత్ నాగ్ లో గురువారం కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని ఉజైర్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ లో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, DSP హుమాయున్ భట్ తిరుగులేని పరాక్రమానికి కాశ్మీర్ జోన్ పోలీసులు నివాళులు అర్పించారు.