Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలో ఓనం పండగ సందర్భంగా తిరువోణం బంపర్ లాటరీని నిర్వహించారు. ఈ లాటరీలో తిరువనంతపురంలోని 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ బహుమతుల విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టికెట్ నంబర్ TJ 750605 గల వ్యక్తి రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు వెల్లడించారు. ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి భగవతి ఏజెన్సీ విక్రయించినట్లు తెలుస్తోంది.
Read Also: Rajanna Pattu Brand: సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ అవిష్కరణ
ఈ లాటరీలో రెండో బహుమతి కింద రూ.5 కోట్లను కొల్లం జిల్లాలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన వ్యక్తి గెలుచుకున్నాడు. టిక్కెట్ నంబర్ TG 270912కి రెండో బహుమతి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. మూడో బహుమతి కింద 10 మంది ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున సొంతం చేసుకున్నారు. కాగా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత 10% ఏజెంట్ కమీషన్, బహుమతి పన్ను మినహాయించబడిన తర్వాత అనూప్ దాదాపు రూ.15 కోట్లను ఇంటికి తీసుకెళ్లనున్నాడు. ఈ ఏడాది ముద్రించిన 67.5 లక్షల లాటరీ టిక్కెట్లలో 66,55,914 టిక్కెట్లు అమ్ముడయ్యాయని లాటరీ విభాగం సీనియర్ అధికారి తెలిపారు. అటు తాను గెలుచుకున్న డబ్బుతో చెఫ్‌గా పనిచేయడానికి త్వరలో మలేషియాకు వెళ్లాలని యోచిస్తున్నట్లు అనూప్ వెల్లడించాడు. ప్రైజ్ మనీని తన అప్పులు తీర్చేందుకు, బంధువులకు సాయం చేసేందుకు వినియోగిస్తానని స్పష్టం చేశాడు.