సాధారణంగా ఏటీఎం మెషీన్‌లో ‘కర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్’ అంటూ వచ్చే నోట్ల శబ్దమే ఏదో తెలియని మధురానుభూతిని ఇస్తుంది. చాలా సమ్మగా అనిపిస్తుంది. అలాంటిది.. కొట్టిన మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ డబ్బులొస్తే? ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా ఇలాంటి పరిణామమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పుర్ జిల్లా ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో బుధవారం ఓ వ్యక్తి రూ. 500 విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. అతనికి రూ. 500కి బదులు రూ. 2,500 వచ్చాయి. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటీ వింత అనుకొని, మరోసారి రిపీట్ చేశాడు. రెండోసారి కూడా అతనికి రూ. 2,500 వచ్చాయి.
ఈ విషయం స్థానికంగా ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది. ఇంకేముందు.. ఈ బంపరాఫర్‌ని వదులుకోకూడదని జనాలందరూ ఈ ఏటీఎం కేంద్రానికి పెద్దఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విషయం తెలుసుకొని ఆ ఏటీఎంని మూసివేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీయగా.. రూ. 100 నోట్లు ఉంచాల్సిన ట్రేలో రూ. 500 నోట్లను తప్పుగా జమ చేసినట్టు తేలింది. అందుకే డబ్బులు అధికంగా విత్‌డ్రా అయ్యాయి. కాగా.. ఎవరెవరు ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారో ఆరా తీసే పనిలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు.