ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. బీజేపీ ఆదేశాల మేరకు ఎల్జీ వీకే. సక్సేనా అతిషి వస్తువులను తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
గత నెలలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక కేజ్రీవాల్ అక్టోబర్ 4న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన పార్టీ నేతకు సంబంధించిన ఇంట్లో ఉంటున్నారు. అక్టోబర్ 7న అతిషి.. కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. రెండ్రోజులైనా గడవక ముందే.. ఇంట్లో వస్తువులను తొలగించి.. సీలు చేశారు. ఈ తీరును ఢిల్లీ సీఎంవో తీవ్రంగా ఖండించింది. బలవంతంగా తొలగించారంటూ ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఇంకా స్పందించలేదు.
‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ గవర్నర్.. ముఖ్యమంత్రి నివాసం నుంచి ముఖ్యమంత్రి అతిషి వస్తువులను బలవంతంగా తొలగించారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపించింది. అధికారిక నివాసం నుంచి అనేక డబ్బాలు, సామాను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అంతేకాకుండా ఇంటికి తాళం కూడా వేసేశారు. సరైన పత్రాలను చూపించలేదని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వర్గాలు పేర్కొన్నాయి.
నార్త్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని 6వ నంబర్ బంగ్లాకు అతిషి సోమవారం మారారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ నివాసంలో తొమ్మిదేళ్ల పాటు ఉన్నారు. అయితే అతిషికి కేటాయింపునకు సంబంధించిన పత్రాలు విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేటాయింపునకు సంబంధించిన పత్రాలు పీడబ్ల్యూడీకి అప్పగించాల్సి ఉంటుందని బీజేపీ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదని, అతని వస్తువులు చాలా ఇప్పటికీ బంగ్లాలో ఉన్నాయని ఆరోపించారు.
మరోవైపు బంగ్లాను ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ బంగ్లాను ఖాళీ చేసినట్లు డాక్యుమెంటరీ రుజువు ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ అంశంపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తింది.