Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నా ఇంటి నుంచి బయలుదేరుతాను. మేము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము, మరియు నేను దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే, చింతించొద్దు’’ అని కేజ్రీవాల్ ఈ రోజు విలేకరులు సమావేశంలో అన్నారు.
Read Also: CWC: 150 ప్రధాన రిజర్వాయర్లలో 23 శాతానికి పడిపోయిన నీటి మట్టం..
50 రోజుల జైలు శిక్షలో తన ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని, ఫలితంగా బరువు తగ్గడంతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, డయాబెటిస్‌కి మందులు ఇవ్వకుండా తిరస్కరించారని ఆయన అన్నారు. తన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఢిల్లీ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని చెప్పారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులు, ఉచిత మందులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సేవలు, కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ‘‘నేను మీ మధ్య ఉండనప్పటికీ, చింతించొద్దని, అన్ని పనులు జరుగాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు. తాను భౌతికంగా మీ మధ్య లేకున్నప్పటికీ, ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగదని చెప్పారు. వృద్ధులైన తన తల్లిదండ్రుల శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ప్రజలను కోరారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చిలో ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపిస్తోంది. ఆప్ రూ. 100 కోట్లను ఈ స్కామ్‌లో పొందినట్లు ఆరోపిస్తోంది. మరోవైపు ఆప్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా మోడీ సర్కార్ వేధిస్తోందని చెబుతున్నారు.