Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జున్మోని శరీరం వెనకభాగంలో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికి వెల్లడించింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక పలు అనుమానాలకు కారణం అవుతోంది.
పోస్టుమార్టం నివేదికతో అనుమానాలు:
ఇదే కాకుండా ఆమె పక్కటెముకలు రెండు వైపు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట కారణంగా జున్మోని రభా మరణించిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆమె రెండు మోకాళ్లు, మోచేతులు, చేతులపై గాయాల కనిపించినట్లు తేలింది. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రణబ్ దాస్ ను నిన్న సాయంత్రం గౌహతి నుంచి నాగోన్ పోలీస్ స్టేషన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. తాను గౌహతి నుంచి వస్తున్న సమయంలో జున్మోని ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు ఎడమవైపున ఆపి ఉందని, అకాస్మత్తుగా ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టిందని, ప్రమాదానికి ముందు ఓ నల్ల రంగు జీన్స్ ధరించిన వ్యక్తి కారు నుంచి దిగడం తాను చూశానని ప్రణబ్ దాస్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తాను కాసేపు ఉన్నానని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని జఖలాబాధ పోలీసులు ఆదేశించారని వెల్లడించారు.
Read Also: Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్పందించిన సీఎం..
ఈ కేసుపై సీఎం హిమంత బిశ్వసర్మ స్పందించారు. జున్మోని మృతిపై సీఐడీతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే సీబీఐ ద్వారా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు ట్రక్ డ్రైవర్ అస్సాం పోలీసుల ముందు గురువారం లొంగిపోయాడు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుమిత్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ దుస్తుల్లో ఎగువ అస్సాం వైపు ఒంటరిగా జున్మోని రభా ఎందుకు వెళ్తుందని ప్రశ్నిస్తు్న్నారు. ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్యగా ఆమె తల్లి సుమిత్రా రభా ఆరోపించారు.
జున్మోని రభా ‘లేడీ సింగం’, ‘దబాంగ్ పోలీస్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినందుకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసింది. దీంతో పాటు గతేడాది భుయాన్ బీజేపీ ఎమ్మెల్యేలతో వివాదంతో కూడా ఆమె పేరు వార్తల్లో వినిపించింది. పలు అవినీతి ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు రభా. ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.