Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో మదరసాలపై సర్వే చేయాలని నిర్ణయించాయి. దీన్ని అసదుద్దీన్ ఖండించారు. ఇది ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేయడమే అని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలు, ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలను ఎందుకు సర్వే చేయడం లేదని.. వాటిల్లో కూడా సర్వేలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
తమ రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే జరుగుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలియజేసిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గుర్తింపు లేని మదరసాలను గుర్తించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సర్వే ప్రారంభం అయింది.
ఇప్పటికే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న మదరసాలపై చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 4 మదరసాలు నేల కూలాయి. అస్సాం రాష్ట్రంలో మదరసా కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలోని అన్ని మదరసాలను సర్వే చేయాలని ఆదేశించారు. ఎవరైనా మదరసాల్లో బోధన చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తే తప్పకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.