Places of Worship Act: భారతదేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (జనవరి2) విచారణ జరపనుంది. కాగా, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఒవైసీ తన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పటికే, హిందూ పక్షం వ్యాజ్యాలపై పలు మసీదుల సర్వేకు న్యాయస్థానాలు ఆదేశించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక, ఈ అంశంలో విచారణ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో అసదుద్దీన్ వ్యాజ్యాన్ని కలిపే ఛాన్స్ ఉంది. అయితే, 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
Read Also: R.Krishnaiah : కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు
అయితే, ఇటీవల పలు మసీదులు, దర్గాల ప్రాంగణాల్లో సర్వేలు జరపాలంటూ హిందూ సంస్థలు కింది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో అలాంటి పిటిషన్లను తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ మాసంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఒవైసీ పిటిషన్‌ను విచారణ చేయనుంది.