Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అయోధ్యలో జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని గతంలో కేజ్రీవాల్ చెప్పారు. తాను కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్లాలనుకుంటున్నట్లు ఆ సమయంలో చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మంది అయోధ్యకు తరలివస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ రోజు యూపీ సీఎం యోగి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అయోధ్య రాముడి దర్శనానికి వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, ఓపీ రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్‌బీఎస్పీ, జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బస్సుల్లో అయోధ్య చేరుకున్నారు. మైనారిటీ బుజ్జగింపుల్లో సమాజ్‌వాదీ పార్టీ ఉందని యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మైర్య, బ్రజేష్ పాఠక్ విమర్శించారు.