Pulwama attack: పుల్వామా దాడిపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పుల్వామా ఘటన కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఆంటోఆంటోనీ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 40 మంది జవాన్ల ప్రాణాలను బలిగొందని ఆయన విలేకరులు సమావేశంలో అన్నారు. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని చెప్పడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపింది. ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోకుండా, జవాన్లను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లేలా చేశారని, మాజీ గవర్నర్ సత్యపాల్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు.
Read Also: Hinduphobia: అమెరికాలో పెరిగిపోతున్న హిందూఫోబియా.. చట్టసభ ప్రతినిధి కీలక కామెంట్స్
ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. ఆంటోనిపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. సైనికులు త్యాగాలను, వారి కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ అవమానించారని ఆరోపించారు. పుల్వామా దాడి ఫిబ్రవరి 14, 2019 న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 17న ప్రధాని నరేంద్రమోడీ పతనంతిట్టలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎంపీ ఆంటో ఆంటోనీ ఈ వ్యాక్యలు చేయడం గమనార్హం. బీజేపీ తరుపున ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ పోటీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆ పార్టీకి మైనస్‌గా మారుతున్నాయి. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు పాకిస్తాన్ బీజేపీకి శతృవు, కానీ మాకు కాదంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.