Prasannajit Rangari: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
అయితే, 2021 చివర్లోల సంఘమిత్ర తన సోదరుడు బతికే ఉన్నాడని గుర్తించింది. పాకిస్తాన్ జైలులో ఉన్నాడని తెలియజేసే ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలుపెరగని పోరాటం చేస్తో్ంది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా నివాసి కులదీప్ సింగ్ కచ్వాహా అనే మాజీ ఖైదీ నుంచి తనకు 2021లో ఫోన్ వచ్చిందని సంఘమిత్ర తెలిపింది. పాకిస్తాన్ లాహోర్ లోని కోట్ లఖ్‌పత్ జైలులో 29 ఏళ్లు గడిపిన తర్వా కుల్దీప్ విడుదలయ్యారు. 2019లో తాను ప్రసన్నజిత్‌ని కలిశానని సంఘమిత్రతో చెప్పాడు.
Read Also: Minister Thummala: రైతులకు గుడ్ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!
మొదట్లో మానసికంగా అస్థిరంగా ఉన్న ప్రసన్నజిత్ పరిస్థితి మెరుగుపడటంతో చివరకు తన గుర్తింపుని వెల్లడించినట్లు కుల్దీప్ చెప్పారు. ప్రసన్నజిత్ తన మానసిక ఆరోగ్యం క్షీణించకముందే జబల్‌పూర్‌లోని ఖల్సా ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేశాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం సంఘమిత్ర కూలీగా పనిచేస్తూ తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఆశయంతో భోపాల్‌లోని కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
సంఘమిత్ర తండ్రి తన కుమారుడి రాక కోసం ఎదురుచూస్తే ఏప్రిల్ 2024లో కన్నుమూశారు. మానసిక అస్వస్థతకు గురైన తల్లి, ఇంకా తన కొడుకు జబల్ పూర్‌లో చదువుతున్నాడని అనుకుంటోంది. ప్రసన్నజిత్ 2019 నుంచి లాహోర్ సెంట్రల్ జైలులో ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతడిపై ఎలాంటి అభియోగాలు లేదా శిక్షలు లేవు. దీంతో అతడి విడుదల సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.