Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
విలేకరులతో మాట్లాడిన అన్నామలై, బీజేపీ ఎదుగుదలకు పార్టీ కార్యకర్తల కృషి కారణమని అన్నారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా తోసిపుచ్చారని, ‘‘నోటా పార్టీ’’ అంటూ ఎగతాళి చేశారని, కొందరు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయని, ఇతర పార్టీలు బీజేపీ పొత్తు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు.
Read Also: Fines with Drones: ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం.. వారి ఆట కట్టు..!
ఇటీవల సేలంలో పళనిస్వామి పొత్తులపై వ్యాఖ్యలు చేసిన తర్వాత అన్నామలై నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అన్నాడీఎంకే ఏకైక శత్రువు అధికార డీఎంకే అని, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, ఆరు నెలలు వేచి ఉండాలని అన్నారు.
అయితే, అన్నామలై మాట్లాడుతూ, అన్నాడీఎంకే పొత్తు కోసం బీజేపీ టీటీవీ దినకరన్‌ని వదులుకోదని స్పష్టం చేశారు. దినకరన్ అత్త వీకే శశికళతో పాటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన దినకర్, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కి నాయకత్వం వహిస్తున్నారు. ఈయన, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంతో కలిసి బీజేపీ కూటమి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు.
మిత్రులను విడిచిపెట్టడం ఎన్డీయేలో లేదని అన్నారు. అన్నాడీఎంకేకి అనుకూలంగా ఉండటానికి బీజేపీ దినకరన్‌తో సంబంధాలు తెంచుకోదని స్పష్టం చేశారు. 2023లో ఏఐడీఎంకే బీజేపీతో సంబంధాలు తెంచుకుంది. 2021 ఎన్నికల ఓటమికి బిజెపి పొత్తు కారణమని ఎఐఎడిఎంకె సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం కూడా ఆరోపించారు, పార్టీలోని ఇతరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.