Fines with Drones: ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఎక్కువైన రోడ్లు ఆపై ట్రాఫిక్ సమస్య. అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తో నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్లపై వాహనదారులు అసౌకర్యానికి గురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కడం మాత్రం వాహన దారులకు కష్టంగా మారుతుంది.. ఇదే సమయంలో నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న చెయిన్ స్నాచింగులు, చోరీలు , ఆకతాయిలా అల్లరి గొడవలు వంటి అనేక సమస్యలు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ శివ కిషోర్ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే కూడళ్ళలో, ఊరేగింపులు, వీఐపీ మూమెంట్, నిర్మాణష్య ప్రాంతాలు ఇలా అన్నిచోట్ల నిరంతరం డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.
Read Also: IND vs NZ Final: కివీస్ జట్టులో ఈ ఐదుగురు డేంజరస్ ప్లేయర్స్.. వీళ్లతోనే టీమిండియాకు ముప్పు!
ఏలూరులోని రోడ్లపై ఇష్టానుసారం వాహనాలను నిలిపే వారిని డ్రోన్ సాయంతో గుర్తించి ఆటోమేటెడ్ చలాన్ సిస్టమ్ ద్వారా ఫైన్లు విధిస్తున్నారు. పోలీసులు ఎవరూ చూడడం లేదు కదా అనుకుంటూ లో పార్కింగ్ ప్లేస్ లో సైతం వాహనాలను నిలిపివేస్తున్న వారికి డ్రోన్ నిఘా చుక్కలు చూపెడుతోంది. ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డ్రోన్ మానిటరింగ్ ద్వారా మిగతా కూడళ్ళలో ఉండే పోలీసులను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రించే పని సులభతరం అవుతోంది. నిరంతరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ జరుగుతున్న గొడవలు, క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను డ్రోన్ కెమెరాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. దీంతో ఎక్కడ చిన్న గొడవ జరిగినా వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏలూరులో చోటు చేసుకున్న అనేక ఘటనలను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా సమాచారం సేకరించి అదుపు చేయగలిగారు. రాత్రి సమయంలోను డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంటుంది. అనుమానితులు, చోరీలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వారిని ట్రాక్ చేసే దిశగా కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
Read Also: Chhaava Effect : ‘ఛావా’ చూసి ఆ కోటలో నిధుల వేట??
దీంతోపాటు ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకున్న, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా నష్టాన్ని అంచనా వేయడం, తిరణాలు, జాతరలు జరిగే సమయంలో ఎవరైనా తప్పిపోతే వారి సమాచారం వెంటనే డ్రోన్ ద్వారా కనిపెట్టడం లాంటి కార్యక్రమాలకు ఏలూరు పోలీసులు శ్రీకారం చుట్టారు. ప్రజల భద్రత మరింత మెరుగుపరచడానికి డ్రోన్లు ఎంతగా సహాయపడుతున్నాయో అర్థం అవుతుంది. భవిష్యత్తులో సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేయడం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించడం ఇలా అనేక ఈ కార్యక్రమాల్లో డ్రోన్ కెమెరాలు మరింత కీలక పాత్ర పోషించబోతున్నాయి.