Annamalai criticized Udayanidhi Stalin as a playboy: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ..‘క్రౌన్ ప్రిన్స్ ప్లే బాయ్ గానే మిగిలిపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ప్లేబాయ్ గానే మిగిలిపోతాడంటూ విమర్శించారు. అన్నూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నామలై, డీఎంకే టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా డీఎంకే పార్టీ కీలక విభాగం అయిన యూత్ వింగ్ కు చీఫ్ గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.
Read Also: MCD Election: మేయర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ తప్పదా? ఆమ్‌ఆద్మీకి కొత్త టెన్షన్..
అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ ప్రభావం పెంచేందుకు నాలుగు సినిమాలు విడుదల చేశారని.. 80 ఏళ్లయినా.. 80 సినిమాలు విడుదలైనా.. రూ.8000 కోట్ల ఖర్చపెట్టినా యువరాజు ప్లేబాయ్ గా మిగిలిపోతాడని అన్నామలై అన్నారు. నేంజుకు నీది సినిమాలో ఉదయనిధి పోలీస్ రోల్ చేయడంపై విమర్శలు గుప్పించారు. పోలీస్ యూనిఫాం ధరించడానికి ఓ అర్హత ఉండాలని అన్నామలై అన్నారు. వచ్చే వారం కాబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తల నేపథ్యంలో.. డిసెంబర్ 12న యువరాజుకు పట్టాభిషేకం జరుగుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలను రక్షిస్తాను..వారి అభివృద్ధికి పనిచేస్తానని చెప్పడం రాజకీయ నాయకులు ప్రాథమిక విధి అని.. అయితే ఒక ప్రొడక్షన్ కంపెనీ, రూ. 120 కోట్లు కలిగి ఉన్నవారి నుంచి వీటిని ఆశించడం కేవలం కలలో మాత్రమే జరుగుతుందని అన్నామలై అన్నారు.