Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్‌ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది. నిందితుడిని 15 రోజుల కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా, న్యాయమూర్తి ప్రశాంత్ వర్మ 11 రోజుల కస్టడీకి అప్పగించారు.
Read Also: Darshan Case: “చలితో నిద్రపట్టడం లేదు, దుప్పటి కావాలి”.. యాక్టర్ దర్శన్ డిమాండ్..
బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్‌లో అన్మోల్ పాత్ర కీలకమని ఎన్ఐఏ కోర్టుకు వివరించింది. ఈ నెట్వర్క్ లో కీలక సభ్యుడు అన్మోల్ 2022 నుంచి పరారీలో ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌తో సంబంధం ఉన్న కేసులో అరెస్ట్ చేయబడిన 19 నిందితుడు అన్మోల్. నిధుల సోర్సెస్ కనుగొనడానికి, ఇతర సభ్యుల్ని గుర్తించడానికి, సిండికేట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి అన్మోల్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అంతకుముందు, అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని భారత్ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే, అతడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలలో ఈ గ్యాంగ్‌స్టర్‌పై 31 కేసులు నమోదయ్యాయి.