Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్ల కులం, మతం గురించి తెలుసుకోవాలనే వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ‘‘సిగ్గుపడాలి’’ అని అన్నారు. అక్రమ బంగ్లాదేశీ వలసదారులు ఉద్యోగాలు లాక్కుంటారని, దేశ భద్రతకు ముప్పుగా మారారని, బీహార్ ను చొరబాటురహిత రాష్ట్రంగా ఎన్డీయే ప్రభుత్వం మారుస్తుందని ఆయన అన్నారు. ‘‘ఆర్మీ కులం, మతం గురించి అడిగిన రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. మేము కులం, మతం ఆధారంగా సైనిక సిబ్బందిలో వివక్ష చూపము’’ అని అన్నారు.
మంగళవారం బీహార్ లో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లడుతూ దేశంలోని 10 శాతం మంది ప్రైవేట్ సంస్థలు, న్యాయవ్యవస్థలు, బ్యూరోక్రసీలను నియంత్రిస్తున్నారని, సైన్యాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆర్జేడీ ఊచకోతలు, అత్యాచారాలకు పాల్పడిందని, ఎన్డీయే ప్రభుత్వంలో రౌడీలకు స్థానం లేదని అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ మఖానా బోర్డును స్థాపించారని, లాలూ అండ్ కో అధికారంలోకి వస్తే ‘‘చొరబాటుదారుల బోర్డు’’ స్థాపిస్తారని అన్నారు. మోడీ-నితీష్ జోడీ జంగిల్ రాజ్‌ను నిరోధిస్తుందని షా చెప్పారు. ఇందిరాగాంధీ అవినీతికి వ్యతిరేకంగా బీహార్ యుద్ధం చేసిందని, కానీ ఇప్పుడు ఆర్జేడీ సహాయంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించాలని చూస్తోందని ఆరోపించారు.