Amit Shah fake video case: రిజర్వేషన్ల తీసేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు ఓ నకిలీ వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి రిజర్వేషన్ల విషయంలో మతపరమై కోటాను అనుమతించమని అమిత్ షా చెప్పిన వీడియోను మార్పిండ్ చేసి, తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తామనే తప్పుడు వ్యాఖ్యల్ని జోడించి వీడియో వైరల్ చేశారు. దీనిపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) పరిధిలోకి వచ్చే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసి, మే 1న తమ ముందు హాజరుకావాల్ని కోరారు. ఈ కేసులో జార్ఖండ్ పీసీసీ చీఫ్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి.
తాజాగా ఈ కేసులో మరో కాంగ్రెస్ సభ్యుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అరుణ్ రెడ్డి ఎక్స్‌లో ‘‘స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్’’ అనే ఖాతాను నిర్వహిస్తున్నాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డి కాగా, దానికి చైర్ పర్సన్ సుప్రియా శ్రీనాతే ఉన్నారు. పోలీసు వర్గాల ప్రకారం.. అరుణ్ రెడ్డి వీడియోను రూపొందించి, సర్క్యులేట్ చేస్తున్నాడనే ఆరోపణ ఉంది. అతను తన మొబైల్ ఫోన్ నుంచి సాక్ష్యాలు తొలగించడానికి కూడా ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విభాగానికి విచారణ కోసం పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Also: Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
ఇటీవల అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను హైదరాబాద్ పోలీసులు అంతకుముందు రోజు అరెస్ట్ చేశారు. ప్రతీ వ్యక్తి రూ. 10,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలనే షరతుతో నిందితులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సోమ, శుక్రవారాల్లో విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
ఇటీవల సిద్ధిపేటలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిందని ఆరోపిస్తూ ఏప్రిల్ 27న రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ప్రజలను, ఓటర్లను తప్పుదారి పట్టించడం, ఓబీసీ వర్గాలలో భయాందోళనలు సృష్టించడం వంటి ఉద్దేశ్యపూర్వకంగా వీడియోను మార్ఫింగ్ చేయడం లక్ష్యంగా ఉందని, సెక్షన్‌లు 469 (ఫోర్జరీ), 505(1)సి (పుకార్లు వ్యాప్తి చేయడం) ,171G (తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.