Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు. ‘‘బీహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో పీఎం పోస్టు ఖాళీగా లేవు. నితీష్ కుమార్ ఇక్కడ, మోడీ అక్కడ ఉన్నారు’’ అని బీహార్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. లాలూ, సోనియా గాంధీలకు అవకాశం లభించదని చెప్పారు. జింగిల్ రాజ్ నుంచి బీహార్‌ను రక్షించుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలమని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్తుందని అమిత్ షా ప్రజల్ని హెచ్చరించారు.
Read Also: DK Shivakumar: “కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..
‘‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి చాలా మంది యువకులకు టిక్కెట్లు ఇచ్చింది, కానీ ఆర్జేడీ మరియు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వలేదు. లాలూ జీ తన కుమారుడు తేజస్వి (యాదవ్) ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. సోనియా జీ తన కుమారుడు రాహుల్ (గాంధీ) ను ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. రెండు పదవులు ఖాళీగా లేవని నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను’’ అని దర్భాంగా ర్యాలీలో ఆయన అన్నారు.
‘‘పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ లో పీఎఫ్ఐ కార్యకర్తలు చురుగ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాం. వారిని జైలులో పెట్టాం. బీహార్‌లో ఆర్జేడీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు జైలులో ఉంటారని మీరు భావిస్తున్నారా..?’’ అని ప్రశ్నించారు. చొరబాటుదారుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారని విమర్శించారు.
ప్రచారంలో జాప్యం, సీట్ల పంపకాల చర్చలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షేత్ర స్థాయిలో లేకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల, మహాఘటబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ప్రకటించారు. దీంతో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన నేపథ్యంలో అమిత్ షా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2005లో ఆర్జేడీని గద్దె దించిన నితీష్ కుమార్ అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.