మహారాష్ట్ర రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర యూనిట్ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి వచ్చారు. ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశముంది. అయితే రెబల్స్‌తో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. అదే విధంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఏదేమైనా నేడు ఢిల్లీలో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.
కాగా మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలకు ఏక్‌నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. గౌహతి క్యాంప్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తనతోపాటు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఉద్దవ్ ఠాక్రేతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్ విసిరారు. “ఇక్కడ ఏ ఎమ్మెల్యేని అడ్డుకోలేదు, ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తమతో కాంటాక్ట్‌లో ఉన్నారని శివసేన చెబితే, వారు పేర్లను వెల్లడించాలి” అని ఏక్‌నాథ్ షిండే అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వానికి అనుకూలంగా ఉన్నారని, దానిని ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన అన్నారు.